Wednesday, October 23, 2013

అయ్బాబోయ్ భైమేసేత్తంది



అది ఒక పెద్ద మైదానం. పిచ్చి గడ్డి, అక్కడక్కడ బండ రాళ్ళు తప్ప మరేమీ లేదు. సన్నగా వాన పడుతోంది. సూర్యుడు అస్తమించి ఆరుగంటలు అయింది. ఒక వికారం పుట్టించే నిశ్శబ్దం వినపడుతోంది. చక్ చక్ చక్ చక్ మంటూ రెండు అడుగులు వడి వడి గా ఆ మైదానం మీద నడుస్తున్నాయి. (సరిగ్గా ఇక్కడే... ఇక్కడే... నాకు హారర్ కథ రాయాలనే జిజ్ఞ్యాస సడెన్ గా మాయం అయింది. ఒక చిలిపి ఆలోచన వొచ్చింది. కాబట్టి, కథ కామెడి మలుపు తీసుకుంటుంది)...


ఊగుతూ తూలుతూ అడుగులు వేస్తున్న ఆ ఆకారం అప్రయత్నంగా బురదలో కాలు వేసింది. తడిసి తడిసి ముద్ద అయి నీళ్ళు ఓడుతున్న జుట్టు లోంచి రెండు కళ్ళు వాటి వెనక్కి తిరిగి ఉన్న పాదాల వైపు చూసాయి. అది బురద కాదు. పేడ! పెద్ద పేడ!! చాల పెద్ద పేడ!!! వాన నీళ్ళకి ఫ్రెష్ గా తడిసిన జిగట పేడ! అది చూస్తూనే ఆ ఆకారం ముక్కు పైకి ఎగిరేసింది (ముక్కు పైకి ఎగిరేయడం ఐదు వేళ ఏళ్ళ నాడు సుమేరియన్ నాగరికతలో పుట్టిన కళ అని చరిత్ర కారుల అంచనా).

ఏమైనా సరే. కాళ్ళు కడుక్కుని తీరాలని అనిపించింది ఆ ఆకారానికి. కుళ్ళిపోయిన దేహాలతో ఈడ్చుక్కుంటూ తిరగాడే దెయ్యలకి కూడా పేడ తొక్కడం ఇష్టం ఉండదు అనే సత్యాన్ని ప్రకృతి గుర్తించిన
ట్టుంది. అందుకే, ఆకాశానికి అజీర్తి చేసినట్టు ఒక పెద్ద శబ్దం చేసింది.

చర్మం కాలి పోయి, పురుగులు తినేసిన గుర్తులు ఆమె మొహం అంతా స్పష్టంగా తెలుస్తున్నాయి. కళ్ళు మాత్రం స్పష్టంగా తెల్లగా మెరుస్తున్నాయి. బతికున్న రోజుల్లో ఆమె లాక్మే వారి మస్కారా వాడడం వల్లే ఇలా తన కళ్ళు బాగున్నాయని దెయ్యాల కంట్రీ క్లబ్బులో ఒక రూమర్ ఉంది కూడా.

"కాళ్ళు కడుక్కోవాలి అర్జెంటుగా" అనుకుంది ఆ వికృత రూపం. దూరంగా మైదానం చేవర్లో ఒక రేకుల షెడ్డు కనపడుతోంది. పేడ కాళ్ళు ఈడుస్తూ ఆ షెడ్ని చేరుకుంది దెయ్యం.మెల్లిగా గోకినట్టు షెడ్డు తలుపు కొట్టింది లీనామీ. అదే ఆమె పేరు. లీనామీ. లీనామీ తలుపు గోకుతున్న ఆ చప్పుడు పరమ అసహ్యంగా వినిపిస్తోంది ఆ నిశ్శబ్దంలో. ఎవరూ తలుపు మాత్రం తీయలేదు. (దెయ్యాలు తలుపుల్లోంచి దోరచ్చుకద? సినిమాల్లో చూళ్ళేదేంటి?) ఓహో కరష్టే కరష్టే. లీనామీ మెల్లిగా తలుపులోంచి లోపలకి వెళ్ళింది. భయంకరంగా ఉంది ఆ ఇల్లు. కనీసం దారి తప్పిన దెయ్యాలు వొస్తాయే అనే ఇంగితం  కూడా లేకుండా అగరొత్తుల వాసన, యాక్, ఆంజనేయస్వామీ విగ్రహం... ఛీ ఛీ... ఈ మనుషులు బాగుపడరు... అనుకుంటూ మెట్లమీది నుంచి పై అంతస్తుకి వెళ్ళింది. (అది రేకుల షెడ్డు. ఏదో డూప్లెక్స్ లాగా 'పై అంతస్తు' ఎలా ఉంటుంది? అనేగా మీ డౌటు? మీకు సమాధానం కావాలా? దెయ్యం ముందుకు వెళ్ళడం కావాలా? ఆ అది... ఇంకా ప్రశ్నలాపి చదవండి...)

పై అంతస్తులో ఆద మరచి నిద్రపోతున్నారు ఇద్దరు భార్యా భర్తలు. భార్యకి కలలో ఏమి కనిపించిందో కానీ, పాక పకా నవ్వి కాలు విసిరింది. ఆ కాలు భర్తకి కనెక్ట్ అయింది. కట్ చేస్తే, ఆయన నెల మీద... రూమ్లో ఒక మూల బల్లి లా అతుక్కుపోయి ఉన్నాడు. ఆయనకి ఏమి మెలుకువ రాలేదులెండి. అలవాటేనేమో. హ్యాపీ గా అలాగే నిద్రపోతూ కలవరింతలు మొదలు పెట్టాడు. "నా ఆధార్ కార్డు నాకిచ్చెయ్, లేదంటే ఇదే గవర్నమెంట్ మళ్ళీ వోచ్చేయ్యలని శాపం పెడతా" అంటున్నాడు.దెయ్యానికి ఆశ్చర్యం వేసింది.

ఆ దెయ్యం పేరేంటి? ఆ, లీనామీ... మెల్లిగా అతన్ని లేపింది. అతను కళ్ళు తెరిచి ఆమెను చూసాడు. అంతే, గట్టి గట్టిగా నవ్వి, మళ్ళీ గోడవైపు తిరిగి పడుకున్నాడు. బాగా ఫీల్ అయ్యింది లీనామీ. యే? మహమాటానికైనా కాస్త భయపడచ్చుగా?
ఈ సారి వెళ్లి భార్య ని నిద్ర లేపింది. ఆమె దెయ్యాన్ని చూసి, గోముగా నవ్వింది. పెచ్చులు ఊడోస్తున్నచేతిని పట్టి, బలంగా పక్క మీదికి లాగింది. బాలన్స్ తప్పి ఆమె పక్కనే పడిపోయింది లీనామీ అనబడే దెయ్యం. భార్య ఆ దెయ్యం మీద లెఫ్ట్ లెగ్, లెఫ్ట్ హ్యాండ్ వేసి పట్టుకుని మళ్ళీ నిద్రలోకి జారుకుంది. ఆమె గురక వింటుంటే దెయ్యం మేడంకి కడుపులో ముష్కర మూకలు బస్సులు తగలపెట్టినట్టు అనిపించింది. మెల్లిగా వదిలించుకుని లేచి నిలబడింది.

ఊపిరి గట్టిగా పీల్చి వొదిలింది. (తెలుసు, దెయ్యలకి ఊపిరులు ఉండవు. ఇనర్షియ - బతికున్నప్పటి అలవాటు కావడంవల్ల అలా నటించింది. తృప్తి చెందారా? ఓకే.) భువన భోనాన్తరాలు దద్దరిల్లెట్టు కీచుగా ఒక పోలి
కేక పెట్టింది లీనామీ. మొదట రియాక్ట్ అయ్యాడు నెల మీద పడుకున్న భర్త. చెయ్యి జాచి, టీపాయ్ పైన ఉన్న ఇత్తడి పూల కుండీ తీసి, కళ్ళు తెరవకుండానే దెయ్యం వైపు ఒక్క విసురు విసిరాడు. భళ్ళు మని పగిలింది లీనామీ మొహం. పింగాణి ప్లేట్ పీసులు పీసులు అయినట్టు శబ్దం చేస్తూ పదహారు ముక్కలు మొహం మీంచి ఊడి కింద పడ్డాయి. ఒక కన్ను దొర్లి మంచం కిందికి వెళ్ళింది.

"నాకు పేడ కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాండ్రో" అని ఒక్క కంటితో ఏడుస్తూ మళ్ళీ అరిచింది. ఈ సారి భార్య నుంచి వొచ్చింది కదలిక. నిద్రలోనే గిర గిర తిరిగి, మంచం పైనుంచి ఒక దిండుని బీరువా పైకి విసిరింది. బీరువా వైపు చూసింది దెయ్యం ఆశ్చర్యంగా. బీరువా మీద ఒక నల్ల పెట్టె జారి కింద ఉన్న టీపాయ్ పైన పడింది. టీపాయ్ ఊగి కింద ఉన్న కంచం మీద పడింది. కంచం యెగిరి ఫ్యాన్ స్విచ్ లకి తగిలింది. స్విచ్చుల్లోంచి చిన్న మంట వొచ్చి అది వైర్ గుండా ఫ్యాన్ వరకు పాకింది. మిగిలిన ఒక్క కంటితోఆ వైర్ వెంబడి చూసింది లీనామీ. ఆ మంట సీలింగ్ ఫ్యాన్ ని చేరింది. పిల్లడు అర్జెంటుగా వస్తే చేసే చప్పుడు లాంటిది చేసింది ఆ ఫ్యాన్చే. అంతే! టపీ మని ఊగి దెయ్యం నెత్తిన పడింది. అంత పెద్ద ఫ్యాన్ మీద పడబోతుంటే తప్పించుకోవాలి, లేదా దెయ్యంలా మాయం అవ్వాలి. కదా? కాదు. ఇక్కడ లీనామీ కి అంత లేదు. ఫ్యాన్ నెత్తిన పడింది. మరో నాలుగున్నర పార్టులు ఊడి నేల మీద పడ్డాయి.

దుక్ఖం వొచ్చింది దెయ్యానికి. తానంటే భయపడే discipline లేదు ఈ యూస్లెస్ మనుషులకి. పైగా హర్ట్ చేస్తున్నారు. ఛీ ఛీ. ఇలాంటి ఇంట్లో నేను పచ్చి నెత్తురు కూడా ముట్టను. అనుకుంటూ వెనక్కి తిరిగింది. పేడ అంటిన కాలు ఈడ్చుకుంటూ మెట్లు దిగుతుండగా వెనక నుంచి వినిపించాయి నవ్వులు. భార్య భర్తలు ఇద్దరు తెగ నవ్వేస్కున్తున్నారు.


దెయ్యానికి రోషం రాలేదు.
"వెధవ మనుషులు. వాళ్ళ పాపాన వాళ్ళే పోతారు..." అని గొణుక్కుంటూ బయటికి నడిచింది. వెళ్తూ వెళ్తూ ఆ భూత మాంత్రికుడి నేమ్ ప్లేట్ కింద బొగ్గుతో రాసింది... "మనుషులు ఉన్నారు జాగర్త".      

No comments:

Post a Comment