Wednesday, October 23, 2013

అయ్బాబోయ్ భైమేసేత్తంది



అది ఒక పెద్ద మైదానం. పిచ్చి గడ్డి, అక్కడక్కడ బండ రాళ్ళు తప్ప మరేమీ లేదు. సన్నగా వాన పడుతోంది. సూర్యుడు అస్తమించి ఆరుగంటలు అయింది. ఒక వికారం పుట్టించే నిశ్శబ్దం వినపడుతోంది. చక్ చక్ చక్ చక్ మంటూ రెండు అడుగులు వడి వడి గా ఆ మైదానం మీద నడుస్తున్నాయి. (సరిగ్గా ఇక్కడే... ఇక్కడే... నాకు హారర్ కథ రాయాలనే జిజ్ఞ్యాస సడెన్ గా మాయం అయింది. ఒక చిలిపి ఆలోచన వొచ్చింది. కాబట్టి, కథ కామెడి మలుపు తీసుకుంటుంది)...


ఊగుతూ తూలుతూ అడుగులు వేస్తున్న ఆ ఆకారం అప్రయత్నంగా బురదలో కాలు వేసింది. తడిసి తడిసి ముద్ద అయి నీళ్ళు ఓడుతున్న జుట్టు లోంచి రెండు కళ్ళు వాటి వెనక్కి తిరిగి ఉన్న పాదాల వైపు చూసాయి. అది బురద కాదు. పేడ! పెద్ద పేడ!! చాల పెద్ద పేడ!!! వాన నీళ్ళకి ఫ్రెష్ గా తడిసిన జిగట పేడ! అది చూస్తూనే ఆ ఆకారం ముక్కు పైకి ఎగిరేసింది (ముక్కు పైకి ఎగిరేయడం ఐదు వేళ ఏళ్ళ నాడు సుమేరియన్ నాగరికతలో పుట్టిన కళ అని చరిత్ర కారుల అంచనా).

ఏమైనా సరే. కాళ్ళు కడుక్కుని తీరాలని అనిపించింది ఆ ఆకారానికి. కుళ్ళిపోయిన దేహాలతో ఈడ్చుక్కుంటూ తిరగాడే దెయ్యలకి కూడా పేడ తొక్కడం ఇష్టం ఉండదు అనే సత్యాన్ని ప్రకృతి గుర్తించిన
ట్టుంది. అందుకే, ఆకాశానికి అజీర్తి చేసినట్టు ఒక పెద్ద శబ్దం చేసింది.

చర్మం కాలి పోయి, పురుగులు తినేసిన గుర్తులు ఆమె మొహం అంతా స్పష్టంగా తెలుస్తున్నాయి. కళ్ళు మాత్రం స్పష్టంగా తెల్లగా మెరుస్తున్నాయి. బతికున్న రోజుల్లో ఆమె లాక్మే వారి మస్కారా వాడడం వల్లే ఇలా తన కళ్ళు బాగున్నాయని దెయ్యాల కంట్రీ క్లబ్బులో ఒక రూమర్ ఉంది కూడా.

"కాళ్ళు కడుక్కోవాలి అర్జెంటుగా" అనుకుంది ఆ వికృత రూపం. దూరంగా మైదానం చేవర్లో ఒక రేకుల షెడ్డు కనపడుతోంది. పేడ కాళ్ళు ఈడుస్తూ ఆ షెడ్ని చేరుకుంది దెయ్యం.మెల్లిగా గోకినట్టు షెడ్డు తలుపు కొట్టింది లీనామీ. అదే ఆమె పేరు. లీనామీ. లీనామీ తలుపు గోకుతున్న ఆ చప్పుడు పరమ అసహ్యంగా వినిపిస్తోంది ఆ నిశ్శబ్దంలో. ఎవరూ తలుపు మాత్రం తీయలేదు. (దెయ్యాలు తలుపుల్లోంచి దోరచ్చుకద? సినిమాల్లో చూళ్ళేదేంటి?) ఓహో కరష్టే కరష్టే. లీనామీ మెల్లిగా తలుపులోంచి లోపలకి వెళ్ళింది. భయంకరంగా ఉంది ఆ ఇల్లు. కనీసం దారి తప్పిన దెయ్యాలు వొస్తాయే అనే ఇంగితం  కూడా లేకుండా అగరొత్తుల వాసన, యాక్, ఆంజనేయస్వామీ విగ్రహం... ఛీ ఛీ... ఈ మనుషులు బాగుపడరు... అనుకుంటూ మెట్లమీది నుంచి పై అంతస్తుకి వెళ్ళింది. (అది రేకుల షెడ్డు. ఏదో డూప్లెక్స్ లాగా 'పై అంతస్తు' ఎలా ఉంటుంది? అనేగా మీ డౌటు? మీకు సమాధానం కావాలా? దెయ్యం ముందుకు వెళ్ళడం కావాలా? ఆ అది... ఇంకా ప్రశ్నలాపి చదవండి...)

పై అంతస్తులో ఆద మరచి నిద్రపోతున్నారు ఇద్దరు భార్యా భర్తలు. భార్యకి కలలో ఏమి కనిపించిందో కానీ, పాక పకా నవ్వి కాలు విసిరింది. ఆ కాలు భర్తకి కనెక్ట్ అయింది. కట్ చేస్తే, ఆయన నెల మీద... రూమ్లో ఒక మూల బల్లి లా అతుక్కుపోయి ఉన్నాడు. ఆయనకి ఏమి మెలుకువ రాలేదులెండి. అలవాటేనేమో. హ్యాపీ గా అలాగే నిద్రపోతూ కలవరింతలు మొదలు పెట్టాడు. "నా ఆధార్ కార్డు నాకిచ్చెయ్, లేదంటే ఇదే గవర్నమెంట్ మళ్ళీ వోచ్చేయ్యలని శాపం పెడతా" అంటున్నాడు.దెయ్యానికి ఆశ్చర్యం వేసింది.

ఆ దెయ్యం పేరేంటి? ఆ, లీనామీ... మెల్లిగా అతన్ని లేపింది. అతను కళ్ళు తెరిచి ఆమెను చూసాడు. అంతే, గట్టి గట్టిగా నవ్వి, మళ్ళీ గోడవైపు తిరిగి పడుకున్నాడు. బాగా ఫీల్ అయ్యింది లీనామీ. యే? మహమాటానికైనా కాస్త భయపడచ్చుగా?
ఈ సారి వెళ్లి భార్య ని నిద్ర లేపింది. ఆమె దెయ్యాన్ని చూసి, గోముగా నవ్వింది. పెచ్చులు ఊడోస్తున్నచేతిని పట్టి, బలంగా పక్క మీదికి లాగింది. బాలన్స్ తప్పి ఆమె పక్కనే పడిపోయింది లీనామీ అనబడే దెయ్యం. భార్య ఆ దెయ్యం మీద లెఫ్ట్ లెగ్, లెఫ్ట్ హ్యాండ్ వేసి పట్టుకుని మళ్ళీ నిద్రలోకి జారుకుంది. ఆమె గురక వింటుంటే దెయ్యం మేడంకి కడుపులో ముష్కర మూకలు బస్సులు తగలపెట్టినట్టు అనిపించింది. మెల్లిగా వదిలించుకుని లేచి నిలబడింది.

ఊపిరి గట్టిగా పీల్చి వొదిలింది. (తెలుసు, దెయ్యలకి ఊపిరులు ఉండవు. ఇనర్షియ - బతికున్నప్పటి అలవాటు కావడంవల్ల అలా నటించింది. తృప్తి చెందారా? ఓకే.) భువన భోనాన్తరాలు దద్దరిల్లెట్టు కీచుగా ఒక పోలి
కేక పెట్టింది లీనామీ. మొదట రియాక్ట్ అయ్యాడు నెల మీద పడుకున్న భర్త. చెయ్యి జాచి, టీపాయ్ పైన ఉన్న ఇత్తడి పూల కుండీ తీసి, కళ్ళు తెరవకుండానే దెయ్యం వైపు ఒక్క విసురు విసిరాడు. భళ్ళు మని పగిలింది లీనామీ మొహం. పింగాణి ప్లేట్ పీసులు పీసులు అయినట్టు శబ్దం చేస్తూ పదహారు ముక్కలు మొహం మీంచి ఊడి కింద పడ్డాయి. ఒక కన్ను దొర్లి మంచం కిందికి వెళ్ళింది.

"నాకు పేడ కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాండ్రో" అని ఒక్క కంటితో ఏడుస్తూ మళ్ళీ అరిచింది. ఈ సారి భార్య నుంచి వొచ్చింది కదలిక. నిద్రలోనే గిర గిర తిరిగి, మంచం పైనుంచి ఒక దిండుని బీరువా పైకి విసిరింది. బీరువా వైపు చూసింది దెయ్యం ఆశ్చర్యంగా. బీరువా మీద ఒక నల్ల పెట్టె జారి కింద ఉన్న టీపాయ్ పైన పడింది. టీపాయ్ ఊగి కింద ఉన్న కంచం మీద పడింది. కంచం యెగిరి ఫ్యాన్ స్విచ్ లకి తగిలింది. స్విచ్చుల్లోంచి చిన్న మంట వొచ్చి అది వైర్ గుండా ఫ్యాన్ వరకు పాకింది. మిగిలిన ఒక్క కంటితోఆ వైర్ వెంబడి చూసింది లీనామీ. ఆ మంట సీలింగ్ ఫ్యాన్ ని చేరింది. పిల్లడు అర్జెంటుగా వస్తే చేసే చప్పుడు లాంటిది చేసింది ఆ ఫ్యాన్చే. అంతే! టపీ మని ఊగి దెయ్యం నెత్తిన పడింది. అంత పెద్ద ఫ్యాన్ మీద పడబోతుంటే తప్పించుకోవాలి, లేదా దెయ్యంలా మాయం అవ్వాలి. కదా? కాదు. ఇక్కడ లీనామీ కి అంత లేదు. ఫ్యాన్ నెత్తిన పడింది. మరో నాలుగున్నర పార్టులు ఊడి నేల మీద పడ్డాయి.

దుక్ఖం వొచ్చింది దెయ్యానికి. తానంటే భయపడే discipline లేదు ఈ యూస్లెస్ మనుషులకి. పైగా హర్ట్ చేస్తున్నారు. ఛీ ఛీ. ఇలాంటి ఇంట్లో నేను పచ్చి నెత్తురు కూడా ముట్టను. అనుకుంటూ వెనక్కి తిరిగింది. పేడ అంటిన కాలు ఈడ్చుకుంటూ మెట్లు దిగుతుండగా వెనక నుంచి వినిపించాయి నవ్వులు. భార్య భర్తలు ఇద్దరు తెగ నవ్వేస్కున్తున్నారు.


దెయ్యానికి రోషం రాలేదు.
"వెధవ మనుషులు. వాళ్ళ పాపాన వాళ్ళే పోతారు..." అని గొణుక్కుంటూ బయటికి నడిచింది. వెళ్తూ వెళ్తూ ఆ భూత మాంత్రికుడి నేమ్ ప్లేట్ కింద బొగ్గుతో రాసింది... "మనుషులు ఉన్నారు జాగర్త".      

Tuesday, October 22, 2013

చిలిపి సచ్చినోడు

అతని పేరు చింపు. అదేం పేరు? ఆయన ఇష్టమండి, మనం ఏం చేస్తాం చెప్పండి?

అది అక్టోబర్ 2. ఆ పెద్దాయన పుట్టిన రోజు కదా, సెలవు. సెలవు కదా అని పడుకుందాంలే అనుకుంటే, అది పిచ్చ భ్రమ అని అర్ధం అయింది. తెల్లారు ఝామునే ఏడున్నరకి మెలకువ వొచ్చేసింది. ఇంకా చచ్చినా నిద్ర పట్టి చావలేదు. పోనీలే అని పేపర్ తీసి చదవడం మొదలు పెట్టాడు, పాచి మొహంతో.

పేపర్లో ఒక విచిత్రం కంట పడింది చింపుకి. "జీవితంలో చేసిన పనే చేసి చేసి విసిగి పోయారా? అయితే స్వామీ జిగిలిగానంద గారికి ఫోన్ కలపండి". అని ఉంది. కింద ఒక నక్షత్రం పెట్టి, ఈ ఫోన్ చేస్తే దురద చార్జీలు వర్తిస్తాయి, అని కూడా రాసి ఉంది. ఎందుకనో కానీ చింపుకి ఆవేశం వొచ్చింది, కాస్త గుండెలో ఎవరో కాలు జారి పడ్డట్టు కూడా అనిపించింది. అదేంటి? ఏమో మరి, అలాంటి చిత్రాలు చింపుకి కామన్.

వెంటనే ఫోన్ తీసి డయల్ చేసాడు. ఫోన్ మోగింది, ఎవరో ఎత్తారు. కట్ అయిపొయింది. అదేంటి? "మీ పిసినారి
మొబైల్ లో నెలగా మిగుల్చుకున్న 100 రూపాయల balance దుంప నాశనం అయింది. మళ్ళీ  recharge చేసి తగలడండి" అని ఒక అమ్మాయి తిప్పుకుంటూ చెప్పింది ఫోన్లో. ఆహా, దురద చార్జీలు అంటే దూల తీర్చే చర్జీలన్న మాట. బాగుంది బాగుంది బాగుంది". అనుకున్నాడు చింపు. "ఏమైనా సరే, ఈ జ్ఞానాన్ని గ్రోలేయ్యాలి", అనుకున్నాడు. రీచార్జ్  చేయించి మరీ ఫోన్ చేసాడు చింపు. అవతల ఈ సారి ఒక మగ గొంతు మోగింది. అప్పుడే వెనక వివిధ భారతి లో మ్రోగింది వీణ పాట మొదలు అయింది. ఫోన్లో మగ గొంతుకి గడ్డం మొలిచినట్టు అనిపించింది చింపుకి. ఆ ఆలోచనకి కిచ కిచ నవ్వు వొచ్చి, పొట్టలో  ఎవరో పుక్కిలించి ఉమ్మేసినట్టు అనిపించింది.

చింపు నవ్వుకి గడ్డం మొలిచిన గొంతుకు కోపం వొచ్చింది. రెండు సంస్కృత పదాలు తిట్లుగా వాడి, ఆయన చెప్పేది చెప్పేసాడు. "జీవితం అదోలా ఉంటె, ఇవాళ మీ పని ఒకటి మీరే చెడగొట్టు కొండి! అలా చెయ్యడం వల్ల లక లక గ్రహానికి శాంతి  లభిస్తుంది. మీకు ఒక జిలేబి లాంటి లాభం కలగబోతోంది." అని చెప్పారు గడ్డం గొంతు వారు. ఈ లక లక గ్రాహం ఎప్పుడు కనిపెట్టారు, అని అడక్కండి. కామెడి కధల్లో లోజిక్కులు వెతక్కండి.

చింపు ధబాల్న లేచి నిలబడ్డాడు. స్నానం చేసి వొచ్చాడు. అమ్మ పెట్టిన చీవాట్లతో పాటూ, ఇడ్లీలు కూడా నీళ్ళల్లో ముంచుకుని తినేసాడు (పచ్చడి చెయ్యడం మరచిపోయిది మమ్మీ). వెంటనే ఆలస్యం చెయ్యకుండా వెళ్లి పళ్ళు తోముకుని వోచ్చేసాడు. (ఆ ఏం పోయిందట, ఇప్పుడన్నా గుర్తొచ్చి తోముక్కున్నాడు, సంతోషించండి).

చింపు కి మధ్యానం మూడు గంటలకి పెళ్లి చూపులు, అమీర్పేటలో అమ్మాయి వాళ్ళ ఇల్లు. మూడు గంటలకి మమ్మీ డాడీ చింపు బాబు వెళ్ళాల్సి ఉంది. కానీ, బాబు ఇప్పుడే అమీర్పేట బయల్దేరిపోయాడు. డైరెక్ట్ గా శక్తి కపూర్ గారి ఇంటి గేటు తీసుకుని లోపాలకి వెళ్ళాడు. శక్తి కపూర్ వాళ్ళ అమ్మాయి పద్మిని కొల్హా పూరి. పాచి మొహంతో నైటీ వేస్కుని చింపిరి జుట్టు గోక్కుంటూ బయటికి వొచ్చి తలుపు తీసింది. డేంజరస్ గా ఇకిలించాడు చింపు. Dinosaurకి అనీజీ గా ఉంటే అది చేసే లాంటి ఒక సౌండు చేసింది ఆ అమ్మాయి. విచిత్రంగా గెంతుతూ పైకి పరిగెత్తింది.

చింపుకి వెంటనే గోడకి శక్తి కపూర్, వల్ల ఆవిడ పద్మనాభామ్మ ఫోటో కనపడింది. రెడీగా పెట్టుక్కున్న సీడీ మార్కర్ బయటికి తీసి, ఫోటో లో వాళ్ళ ఇద్దరికీ మీసాలు పెట్టాడు. కాసేపు తన పనితనం చూసి గర్వ పడుతుండగా, శక్తి కపూర్ కాఫీ కప్పులతో వొచ్చారు. వంటింటి లోంచి పద్మనాభామ్మ తొంగి చూస్తూ ఉండడం చింపుకి కనపడింది. శ్రీలంక లో ఎల్టిటిఈ పోరాటంలో భయపడి గుడిసె లోనుంచి బయటికి పరిగెడుతున్న జిమ్గిరి మహిళా లా ఉంది.

శక్తి కపూర్ వోచ్చేలోగా స్పీడ్ గా కదిలాడు చింపు. సర సర పరిగెత్తి నెల మీద జార్రున జారి ఆవిడ జుట్టు పట్టుకుని పర పర పీకి, ఇంకాస్త చింపిరి చేసాడు. చిన్న సైజు అడవిలా తయారింది అది. అదే వేగంతో వొచ్చి సోఫా లో కూర్చున్నాడు. బ్యాక్ గ్రౌండ్ లో ఆవిడ డాల్బీ రేంజ్ అరుపులు వొస్తుండగా,  శక్తి కపూర్ చేతిలోంచి కాఫీ కప్పు లాక్కుని, వేడి వేడి కాఫీ ఆయన జేబులో పోసాడు. అదే ఉదుటున జేబులోంచి బిస్కెట్ తీసి ఆయన కాఫీలో ముంచుకుని తినేసాడు. శక్తీని అంతా కూడా గట్టుకుని ఊపిరి గట్టిగా తీసి, బ్రేవ్ అని భీకరంగా త్రేంచాడు.

అంతే! ఎంత వేగంగా వోచ్చాడో, అంత వేగంగా వెళ్ళిపోయాడు చింపు. ఇల్లంతా నిశ్శబ్దం ఆవరించుకుంది.

ఇలా గడ్డం గళం మాట విని, తన పెళ్లి చూపులు తనే చాడగోట్టుకున్నాడు చింపు. దీనివల్ల, ఎలాంటి జిలేబి ట్విస్ట్ రాబోతోందో అని ఆత్రుతగా ఎదురు చూడ సాగాడు. రెండు రోజుల తర్వాత కొరియర్ లో ఒక చెక్కు వొచ్చీన్ది. కోటి రూపాయలు. దానితో పాటే మ్రోగింది ఫోను.

"బాబూ, నువ్వు వెళ్లి ముదనష్టపు పనులు చేసింది శక్తి కపూర్ ఇల్లు కాదు. శశి కపూర్ ఇల్లు. రాంగ్ హౌస్. శశి కపూర్ వాళ్ళు మా ఇంట్లోనే అద్దెకు ఉంటారు. ఖాళీ చెయ్యమంటే పదేళ్లుగా చెయ్యట్లేదు. రౌడీల తో బెదిరించినా లైట్ తీసుకున్నారు. నువ్వు వొచ్చి వెళ్ళాక, "అతనే నాకు కాబోయే అల్లుడు, మా అమ్మాయికి పెళ్లి చెయ్యబోతున్నాం, ఇల్లరికం, ఇంకా రోజూ మీతో చాల ఫ్రెండ్లీ గా ఉంటాడు" అని చెప్పను. ఇల్లు ఖాళీ చేసి పోయారు. నా సంతోషంతో, ఆ ఇల్లు అమ్మిన డబ్బు లాభంలో నీకూ share ఇస్తున్నా. మా అమ్మాయిని మాత్రం, ఇవ్వను సారీ" అని పెట్టేసాడు.

ఇంకా చింపు గారు కూలి కి (అదే, ఏ పని అయితే ఏంటి, అన్నిటిని ఈ మధ్య కూలి అనే అంటున్నాం, అప్డేట్ అవ్వాలి మీరు...) రిజైన్ చేసి, ముదనష్టపు పన్లు చెయ్యడం మీద ఒక కోచింగ్ సెంటర్ పెట్టుకున్నాడు. ఆఫీస్ రూంలో గడ్డం గళం ఆయన ఫోటో వేల్లాడుతూ ఉంటుంది.