
కన్నాంబ కి ఇద్దరు కూతుర్లు. భర్త చనిపోతే, ఒక్కర్తే ఇద్దరినీ పెంచడానికి కష్టాలు పడుతోంది.(ఎప్పుడో కృష్ణ గారు సినిమాల్లో రిక్షా తొక్కినప్పుడు ఇలాంటి కధలు ఉండేవి... ఇదేమ్ గోలరా బాబు?)
చిన్నమ్మాయి కృష్ణ వేణి భాస్కర్ అనే లెక్చరర్ ని ఇష్టపడ్తోంది. పెద్దమ్మాయి నందన సోమవరం మూర్తి అనే సూపర్ మార్కెట్ ఓనర్ ని ప్రేమిస్తోంది. మూర్తి గారికి బట్టతల తో పాటూ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 4, 5 క్లాసులు చదువుతున్నారు వాళ్ళు. సోమవరం మూర్తి గారికి మొదటి భార్యా వియోగం అయ్యి అప్పటికి నాలుగు సంవత్సరాలు దాటింది.
(జిడ్డు పట్టిన పక్క రాష్ట్రం మొహాలు కనిపిస్తున్నారు కళ్ళకి... ఇంకాపు...)

కన్నాంబ పిల్లల చదువుకోసం తన ఒక్కగానొక్క ఇల్లు తాకట్టు పెట్టింది గాజుల నారాయణ దెగ్గర. ఆయన డబ్బుల కోసం ఆమెను పీక్కు తినడానికి ప్రతి నెలా వోచ్చేస్తుంటారు. వొచ్చినప్పుడల్లా, పెద్దరికం నటిస్తూ, చిన్నమ్మాయి కృష్ణ వేణిని నిమేరేయ్యడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.
(అబ్బ, మా లేడీస్ మీటింగ్స్ లో వీడిని కసి తీరా తిట్టేస్కోవాలి. డైరీలో రాస్కుంటాను ఉండు )
ఒక రోజు ఆయన్ను కన్నాంబ చీవాట్లు పెడుతుంది. కోపం వొచ్చిన గాజుల నారాయణ, కోర్టు నోటీసు పంపిస్తా
రు. అందరికి ఇల్లు ఖాళీ చెయ్యాల్సి వొస్తుంది.
(అయ్యో మగ దిక్కులేని ముగ్గు ఆడవాళ్ళు ఎటు పోతారు? ఈ మగ పురుగులు బాగుపడరు... నాశనం అయిపోతారు... అయ్యో...)
ముగ్గురిని ఆదుకుంటారు సోమవరం మూర్తి. వారిని తన ఇంటిలోనే ఉంచుకుని మంచివాడనిపిన్చుకుంటాడు. (ఏమోనమ్మ, వాడి మొహం చూస్తే నాకు ఏదో అనుమానంగా ఉంది. మనసులో ఏం పాడు ఆలోచనలు పెట్టుకున్నాడో... అసలే ఆడ కూతుర్లు ... సరే చూద్దాం, వాడేమన్న చేస్తే వాడిని చంపి పారేయ్యనూ?) పిల్లలు స్కూలుకి అమ్మాయిలు కాలేజికి వెళ్ళాక, కన్నాంబ కాలక్షేపానికి పక్కింటి వారితో ఎదురింటి వారితో మాట్లాడుతూ ఉంటుంది. (బ్రహ్మాండం...)
వాళ్ళు నోరు జారి కన్నాంబ గురించి, ఆమె పిల్లల కి మూర్తి కి మధ్య సంబంధం గురించి అసభ్యంగా మాట్లాడతారు. కన్నాంబ నొచ్చుకుంది. రెండు రోజులు అన్నం తినదు. పిల్లలు అడగ్గా అడగ్గా, విషయం చెప్తుంది. (వీళ్ళ నోళ్ళు పడిపోనూ... వాళ్లకి ఎందుకంట?)
ఒక రోజు మూర్తి తాగి వొచ్చి, పెద్దమ్మాయి నందన ని రేప్ చేస్తాడు. (అయ్యా ఇది ఘోరం)
ఇది తెలిసి కన్నాంబ గుండె నొప్పి తో ఆస్పత్రిలో చేరుతుంది. (ఏంటీ అన్యాయం? ఆదుకోవడానికి హీరో లాంటి వాళ్ళు ఎవరూ లేరా?)ఇంతలో చిన్న అమ్మాయి కృష్ణ వేణి కనపడకుండా పోతుంది. ఆమెని వెతుకుతూ, ఆమె ప్రేమిస్తున్న లెక్చరర్ భాస్కర్ని లాకప్ లో వేస్తారు పోలీసులు. ఇంతలో కృష్ణ వేణి శవం ఒక రైల్లో దొరుకుతుంది. భాస్కర్ కి శిక్ష పడుతుంది. (అరె, వాడు ఏమీ చెయ్యలేదని చెప్తున్నాడు కదా... ఐనా మాలక్ష్మి లా వెలిగిపోయ్యేది, ఆమె చచ్చిపోయాక ఇంకా అనవసరం ప్చ్ ... నాకెందుకో బతకాలని లేదు. ఇవాళ వంటలో బెండకాయలు మాడ్చి పెడతాను మా ఆయనకీ... తప్పదు ...)

అప్పుడే ఆస్పత్రి నుంచి వొచ్చిన కన్నాంబ ఈ విషయం విని, తట్టుకోలేక అక్కడికక్కడే మరణిస్తుంది.
(ఈమె వేరే సీరియల్ లో బిజీ అనుకుంటా . క్యారెక్టర్ తీసేశారు.)
ఇదంతా చూసి మనస్తాపం చెందిన సోమవరం మూర్తి నందన ని ఇంట్లోంచి
వెళ్లి పొమ్మంటాడు.
(ఎక్కడికి వేల్తుందయ్యా, తల్లి లేదు, చెల్లి లేదు, అమాయకురాలు, నీ చేతిలో పాడైపోయిన పిల్ల కదరా... త్రాష్టుడా...)

ఆమె దిక్కుతోచని స్థితిలో రైలు పట్టాల మీద నడుస్తుండగా, ఒక చిన్న పిల్లాడు కనిపిస్తాడు. వాడు చచ్చిపోవడానికి రైలు ముందు నిలబడి ఉంటాడు. వాడిని కాపాడి, వాళ్ళ ఇంట్లో అప్పచెప్తుంది నందన. ఆ పిల్లాడి తండ్రి రాజారామ్ (ఈ పేరు ఒక 500 సీరియల్స్ లో పెట్టారు ఆల్రెడీ) బిజినెస్ మాన్.
ఆమెకు కృతఙ్ఞతలు చెప్పి, బాబుకు మంచి చెప్పడానికి, చదువు నేర్పించడానికి ఇంట్లోనే ఉండిపోమ్మంటాడు. (అబ్భ, దేవుడి లాంటి మనిషి పాపం, రాజారామ్ గారు).
ఒక రోజు ఆ పిల్లాడు గొడవ పెడితే, నికిత అనే ప్రఖ్యాత డాన్సర్ ప్రోగ్రాం కి వెళ్తుంది నందన. ఆ డాన్సర్ తన చెల్లెలు కృష్ణ వేణే అని తెలిసి ఆశ్చర్య పోతుంది. (అయ్యో అవునా, మన కృష్ణ వేణి బతికే ఉందా?)
ఉండబట్టలేక నికితను ప్రోగ్రాం తర్వాత కలిసి పలకరిస్తుంది నందన. కృష్ణ వేణి, అక్కని పట్టుకుని ఏడుస్తుంది. (ఆహ మనసు కుడట పడింది, ఆమె తను కృష్ణ వేణి కాదని చెప్తుందని హడలి చచ్చాను. మా చంటి గాడికి యాదగిర్ గుట్ట లో గుండు కొట్టిస్తానని మొక్కుకున్నా కూడా)మూర్తి తనను దుబాయ్ లో ఒకాయనకి అమ్మేసాడని, ఆ దుబాయ్ ఆయన తనమీద జాలి తలిచి దయగా ఉండేవాడని, తనను డాన్సు చెయ్యడం చూసి, పెద్ద డాన్సర్ అయ్యేలా ప్రోత్సహించాడని, ఆయన్నే తను పెళ్లి చేసుకుందని చెప్తుంది. (పోనీలే, మంచి వారికి అంతా మంచే జరుగుతుంది. ఆ భాస్కరే అన్యాయం అయిపోయాడు పాపం. వాడిని అనవసరంగా జైలు లో పెట్టారు)
తనను నాశనం చేసి, తన చెల్లిని అమ్మేసి, తన తల్లి చావుకు కారణం అయిన సోమవరం మూర్తి ఇంటికి వెళ్తుంది
నందన. కసి తీరా అతన్ని పొడిచి చంపేస్తుంది
(పొడిచి చంపేస్తుందా? ఈ స్టైల్ ఆఫ్ హత్యలు ఎప్పుడో క్రీస్తు పూర్వం జరిగేవి కాదమ్మా... అప్డేట్ అవ్వాలి సీరియల్ వాళ్ళు)
ఆయన పిల్లలని ఆమె తన వెంట తీస్కెళ్ళి పెంచుకుంటుంది.

ఆ, ఇంకా టీవీ కట్టెయ్యండి. పదిహేను వందల ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న"చెత్త బతుకులు" సీరియల్ ఈ రోజుతో ముగిసింది.ఇసీ ఖుషీ మే ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు పాయసం చేసుకుని, తిని, పండగ చేసుకోండి.
వొళ్ళు మండితే క్షమించండి. సీరియళ్ళు గత్యంతరం లేక చూసి చూసి, నాకు కాస్త స్క్రూ లూసు అయ్యి...
ఏంటి? నేను కూడా ఒక బ్రహ్మాండమైన సీరియల్ తీయచ్చా? స్టొరీ బాగుందా?
వామ్మో... అలా అయితే ఈ సీరియల్ కి ఏం పేరు పెట్టాలో చెప్పండి... ఎదురు చూస్తుంటాను... టాను... టాను... ను...












